President’s Message
President’s Message
@apta

ఆత్మీయ అప్తులకి నూతన సంవత్సర శుభాభినందనలు మరియు రైతుల పండగ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

ఈ సంవత్సరం ఆప్త ని ముందుకు తీసుకెళ్ళటానికి మా మీద అనితర భాద్యత ని పెట్టినందుకు అందరికి ధన్యవాదములు. ఈ 2016 లో ప్రధానం గా చెయ్యబోతున్న పనులలో కొన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాము.

• సేవ ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఆప్త ని అన్ని సంస్థల కంటే మెరుగైన స్థానం లో నిలిపే దిశగా ప్రయత్నాలు

• సభ్యుల సంఖ్య ని 1150 నుంచి 3000 కి తీసుకువెళ్ళే విధంగా ప్రణాళికలు.

• ఆప్త శాశ్వత నిధి ని వృద్ధి చేసుకోవటానికి వీలు అయిన అన్ని సన్మార్గాల ద్వారా ప్రయత్నాలు చెయ్యటం

• అమెరికా లో ఉన్న ప్రతి రాష్ట్రం లోను మన సభ్యుల సంఖ్య మెరుగుపర్చుకుంటూ, వీలు అయిన అన్ని సార్లు పిక్నిక్ లు, సమావేశాలు ఏర్పాటు చేసుకోనేటట్టు ప్రోత్సహించటం

• వెబ్ సైట్ ఆధునీకరణ పనులు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి, ఉగాదికి ప్రారంభించటానికి సర్వ సన్నద్ధం చెయ్యటం.

• ఎంతో మంది పేద విద్యార్ధులు ఆప్త సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, వారిని నిరాశ పరచొద్దు. గత ఏడాది కంటే మరింత ఎక్కువ మందిని అక్కున చేర్చుకుందాం. ఆప్త ప్రధాన కార్యక్రమం ASEP ని మరింత బలపరచటం.

• అప్తులందరికి తక్షణ సహాయం అందించటానికి ఆప్త హెల్ప్ లైన్ తొందర్లో మీ అందరికి అందుబాటులోకి తీసుకురావటం.

• మనలో చాలా మంది పేద/మధ్య తరగతి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఈ రోజు మన తెలుగు రాష్టాల్లో సగటు రైతు పురుగు మందు పొలంలో ప్రయోగించటాని కంటే తన మీదే ప్రయోగించుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువ గా ఉన్నాయి. కొంతలో కొంత అయినా ఈ పరిస్థితిని రూపు మాపి రైతు కి అండగా ఉండటానికి ఇప్పటి నుండి ఆప్త సంసిద్ధం అవ్వటం.

• ఆకాశం లో సగం భూమి లో సగం అయిన మహిళలు ఆప్త లో కూడా మరిన్ని భాధ్యతలు తీసుకొనే విధంగా ప్రోత్సహించటం.

• ఆరోగ్యం మహా భాగ్యం అనేది ఒక నానుడి, ఈ దేశం లో దాని కోసం మనము చెల్లించే మూల్యం అందరికి తెలిసిందే. మనందరి కోసం, అలాగే మనల్ని చూడటానికి వచ్చే పెద్ద వారి కోసం ఆరోగ్య సలహాలు ఇచ్చే ఒక వైద్య నిపుణుల బృందం తయారు చేసుకోవటం.

• పిల్లలు మన జీవితంలో అతి పెద్ద ముఖ్య భాగం. వారి ప్రాధమిక విద్య, ఆరోగ్యం, ఉన్నత విద్య, వాలంటీర్ అవకాశాలు ఇత్యాది అంశాలు చూసుకోవటానికి ఒక కమిటీ ఏర్పాటు

• సభ్యుల కోసం సాంకేతిక శిక్షణ తరగతులు నిర్వహించటం, మెరుగైన ఉపాధి అవకాశాలు చూపించటం.

• అన్నిటికంటే ముఖ్యంగా మన లో మనం క్రమశిక్షణ సాధించటం, సమయ పాలన, పెద్ద వారిని గౌరవించటం, నాయకత్వాన్ని బలపరచటం లాంటివి మన ముఖ్యాంశాలుగా ఉండాలి.

ఆప్త ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ సంవత్సరం లో అడుగుపెడుతుంది. ఐక్యత ఉండదు ఎన్నో రోజులు మనుగడ సాధించలేదు అన్న అపోహలు అన్నింటిని అధిగమించి ఈ రోజు ఆప్త ఒక బలీయమైన శక్తీ గా రూపాంతరం చెందుతూ వుంది. ఈ రోజు ఆప్త పచ్చని చెట్టు, ఎంతో మందికి నీడ ని, మరింత మందికి ఎన్నో ఫలాల్ని ఇస్తూ వుంది, సహజంగానే కొన్ని రాళ్ళ దెబ్బలకి సిద్ధంగా ఉండాలి.

ఎంతో మంది ఆప్తులు తమ తమ విలువైన వ్యక్తిగత సమయాన్ని, కష్టార్జితాన్ని స్వచ్చందంగా ఆప్త కోసం వెచ్చిస్తున్నారు, వారి త్యాగాన్ని వృధా కానివ్వద్దు. ప్రతి నిమిషం, ప్రతి డాలర్ ఎంతో విలువైనవి. మీ అందరి సహకారం తోనే ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి.

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు. ఇది ఆరు నెలల ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినం. ఈ రోజున ASEP కార్యక్రమం కోసం నిధుల సేకరణ (Dollar A Day) మొదలుపెడుతున్నాము. మొదటగా కార్యవర్గం లోని పన్నెండు మంది కలిసి 12*$366 = $4392 మొత్తాన్ని విరాళంగా ప్రకటిస్తున్నాము, మీ వంతు సహాయాన్ని అందించండి

మన భవిష్యత్తు తరాలు ఆప్త సంస్థ ని, మనల్ని ఒక ఆదర్శం గా తీసుకోనేటట్టు చేయాలి, రండి కలిసి ముందుకి సాగుదాం. ఆప్త ని పటిష్టం చేద్దాం. మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ……

ధన్యవాదాలు,

గోపాల కృష్ణ గూడపాటి,
ప్రెసిడెంట్ ఆప్త
401-234-4566